తెలిసిన వ్యక్తుల పేర్లతో బురిడీ.. ఆదమరిస్తే వాట్సప్ గల్లంతు!

ఖాతాలు అధీనంలోకి తెచ్చుకుంటున్న వైనం

On
తెలిసిన వ్యక్తుల పేర్లతో బురిడీ.. ఆదమరిస్తే వాట్సప్ గల్లంతు!

 

Read More Local body elections:వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు

ప్రభాత సూర్య- తెలంగాణ బ్యూరో:

ఇది వాట్సప్ లోకం. చాలామంది దానిని చూడకుండా ఎక్కువసేపు ఉండలేరు. అందుకే సైబర్ నేరగాళ్లు దానిపై కన్నేశారు

 

ఆదమరిస్తే వాట్సప్‌ను కొట్టేస్తున్నారు. అంటే అందులోని ఫోన్‌ నంబర్లు, ఫొటోలు, వీడియోలు, వృత్తిపరమైన...వ్యక్తిగతమైన సమాచారం అంతా చోరీ చేయడం అన్నమాట. వనజ ఒక గృహిణి. ఇటీవల ఆమె పిల్లలు చదువుతున్న విద్యాసంస్థలో పనిచేసే ఉపాధ్యాయురాలి ఫోన్‌ నంబర్‌ నుంచి ఒక మెసేజ్‌ వచ్చింది. 'నా వాట్సప్‌ రీ ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్నా.. పొరపాటున నా నంబర్‌ బదులు మీది ఇచ్చా... కోడ్‌ మీకు వచ్చింది.. దాన్ని నాకు పంపండి' అన్నది దాని సారాంశం. తెలిసిన వ్యక్తే కదా అన్న ఉద్దేశంతో వనజ తనకు వచ్చిన కోడ్‌ను ఆమెకు పంపారు. అంతే.. వెంటనే వనజ వాట్సప్‌ పనిచేయడం మానేసింది. ఏమైందో అర్థం కాక ఆమె అయోమయానికి గురయ్యారు. నిపుణులతో మాట్లాడితే వాట్సప్‌ను నేరగాళ్లు వారి అధీనంలోకి తెచ్చుకున్నారని చెప్పారు.

Read More Etala Rajender:కాళేశ్వరం పై ఈటల పొగడ్తల వర్షం

 

ఇలా పావులు కదుపుతారు...

 

సైబర్‌ నేరగాళ్లు రకరకాల మార్గాల్లో అనేక మంది ఫోన్‌ నంబర్లు, ఫొటోలు, మెయిల్‌ ఐడీల వంటి వివరాలు సంపాదిస్తారు. వాటి ద్వారా పావులు కదపడం మొదలు పెడతారు. సమాచారాన్ని తస్కరించేందుకు వారి ఫోన్లో ఆయా వ్యక్తుల వాట్సప్‌ను ఇన్‌స్టాల్‌ చేసేందుకు ప్రయత్నిస్తారు. వనజకు మెసేజ్‌ పంపినట్లే ఇతరులకు కూడా మెసేజ్‌ పంపి కోడ్‌ కోసం తొందర పెడతారు. కోడ్‌ పంపితే వనజకు ఎదురైన అనుభవమే వారికీ ఎదురవుతుంది. వాట్సప్‌ నేరగాడి అధీనంలోకి వెళ్లిపోతుంది.

 

గొలుసుకట్టు కథ మొదలు..

 

ఇదొక గొలుసుకట్టు మోసం. ఒకరి వాట్సప్‌ అధీనంలోకి తెచ్చుకోగానే నేరగాడు అందులో ఉన్న వారందరికీ మెసేజ్‌లు పంపడం మొదలుపెడతాడు. వాట్సప్‌ రీయాక్టివేషన్‌లో భాగంగా పొరపాటున తన నంబర్‌ బదులు మీ ఫోన్‌ నంబర్‌ ఇచ్చానని మళ్లీ పాత కథే చెబుతాడు. వచ్చిన కోడ్‌ను తనకు పంపమని అడుగుతాడు. అడుగుతున్నది తెలిసిన వ్యక్తి, ఫోన్‌ నంబర్‌ కూడా తెలిసిన వారిదే కాబట్టి సాధారణంగా ఎవరికీ అనుమానం రాదు. వచ్చిన కోడ్‌ను పంపుతారు. దాంతో వారి వాట్సప్‌లో డేటా మొత్తం చోరీ చేసి వాటి ద్వారా మరింత మందిని బోల్తా కొట్టిస్తాడు. డేటాను అడ్డం పెట్టుకొని బెదిరిస్తాడు. మోసాలకు దిగుతాడు.

 

అత్యవసరంగా డబ్బు అవసరం పడిందనీ అడగవచ్చు...

 

ఒకసారి మన వాట్సప్‌ మరో వ్యక్తి అధీనంలోకి వెళితే అందులోని సమాచారంతో సైబర్‌ నేరగాళ్లు ఎంతకైనా తెగించవచ్చు. మనమే అడిగినట్లుగా అత్యవసరంగా డబ్బు అవసరం పడిందని మెసేజ్‌లు పెట్టవచ్చు. అడుగుతున్నది తెలిసిన వ్యక్తే కదా అని చాలామంది డబ్బు పంపే అవకాశం ఉంది. అలానే మన వాట్సప్‌లో బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు ఉంటే అందులో ఉన్న డబ్బంతా కొట్టేయవచ్చు. చాలామంది ఎవరైనా మిత్రులు, బంధువులు షాపింగ్‌కు వెళ్లినప్పుడు తమ క్రెడిట్‌కార్డును ఫొటో తీసి వారికి పంపుతారు. దాని ద్వారా వారు చెల్లింపులు జరుపుతారు. ఇలా వాట్సప్‌లో ఉన్న క్రెడిట్‌కార్డు ఫొటో నేరగాళ్లకు చిక్కితే దాన్ని దుర్వినియోగం చేస్తారు. ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి, సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరింపులకు దిగవచ్చు.

 

ఎలా బయటపడాలంటే...

అసలు ఎవరూ కూడా మరో వ్యక్తి నంబర్‌తో వాట్సప్‌ను రీయాక్టివేట్‌ చేసుకోరు. ఒకవేళ అలా ఎవరైనా చేసినట్లు చెబితే దాన్ని అనుమానించాలి. మళ్లీ అసలు నంబర్‌ ద్వారా రీయాక్టివేట్‌ చేసుకోవాలని చెప్పాలి. ''ఒకవేళ పొరపాటున కోడ్‌ పంపడం వల్ల వాట్సప్‌ నేరగాడి అధీనంలోకి వెళితే అసలు వ్యక్తి వాట్సప్‌ పనిచేయడం ఆగిపోతుంది. అటువంటప్పుడు తెలిసిన వ్యక్తులకు ఫోన్‌ చేసి, వారి ఫోన్లలో తన పేరుమీద ఉన్న వాట్సప్‌ ఖాతా తెరిచి, దాన్ని 'రిపోర్ట్‌' చేయమని చెప్పాలి'' అని సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు పాటిబండ్ల ప్రసాద్‌ సూచించారు. ఎక్కువ మంది రిపోర్ట్‌ అని కొట్టగానే వాట్సప్‌ ఆటోమెటిక్‌గా 24 గంటలపాటు ఆ ఖాతాను బ్లాక్‌ చేస్తుందని, తర్వాత అసలు వ్యక్తి మళ్లీ తన నంబర్‌ ద్వారా వాట్సప్‌ రీయాక్టివేట్‌ చేసుకోవచ్చని ఆయన వివరించారు.

Views: 28

About The Author

Latest News