ఎమ్మెల్సీలు తీన్మార్‌ మల్లన్న, కవిత మధ్య బీసీ రిజర్వేషన్ల రగడ

On
ఎమ్మెల్సీలు తీన్మార్‌ మల్లన్న, కవిత మధ్య బీసీ రిజర్వేషన్ల రగడ

ఎమ్మెల్సీలు తీన్మార్‌ మల్లన్న, కవిత మధ్య బీసీ రిజర్వేషన్ల రగడ రాజుకుంది. కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడికి దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నాయి. హైదరాబాదులోని మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి జరిగింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి దిగారు. దాడి సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంలోనే ఉన్నారు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు.  మల్లన్నపై దాడి చేసేందుకు ప్రయత్నించిన జాగృతి కార్యకర్తలను అడ్డుకునేందుకు తీన్మార్‌ మల్లన్న గన్‌మెన్‌ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం.

తన కార్యాలయంపై దాడిపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో బీసీ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే అది భ్రమేనని మల్లన్న చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ తరహా దాడులు చేసినంత మాత్రాన బీసీలు, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము చేసే ప్రయత్నం ఏ మాత్రం తగ్గదని చెప్పారు. మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తామని తీన్మార్‌ మల్లన్న అన్నారు. అనంతరం దాడి ఘటనపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మల్లన్నపై శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. విచక్షణాధికారాలు ఉపయోగించి ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్‌ చేయాలని కోరారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు. తాను బీసీ ఉద్యమం చేస్తుంటే మల్లన్న ఎందుకు తట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.తక్షణమే తీన్మార్‌ మల్లన్నను సీఎం రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తామని అన్నారు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి ఘటనపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్ బాబు స్పందించారు. క్యూ న్యూస్‌ ఆఫీస్‌ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ మల్లన్న గన్‌మెన్‌ల వల్ల ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఇరు వర్గాల తోపులాటలో ఆఫీస్‌ అద్దాలు పగిలాయని చెప్పారు. కొందరికి గాజు పెంకులు గుచ్చుకున్నాయని చెప్పారు. దాడి చేయడానికి వచ్చిన జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నామని సీపీ వెల్లడించారు. కాగా, తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి కవిత ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో ఆమె డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూ న్యూస్‌ కార్యాలయంపై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Views: 1

About The Author

Tags:

Related Posts

Latest News