ఫైర్ బ్రాండ్ ను వదులుకున్న బీజేపీ

On
ఫైర్ బ్రాండ్ ను వదులుకున్న బీజేపీ

రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ కేంద్ర నాయకత్వం

తెలంగాణ బీజేపీలో మొన్నటి వరకు ఆయన ఫైర్ బ్రాండ్. హిందుత్వం, పార్టీ నేతలపైనే నేరుగా విమర్శలు గుప్పించే ఆయన..ఇప్పుడు ఏ పార్టీకి చెందని వ్యక్తిగా మిగిలిపోయారు. బీజేపీ రాజాసింగ్ రాజీనామా ఆమోదం పొందింది. ఆయనను బీజేపీ వదులుకోవడానికి కారణాలు ఏంటి? పార్టీ నేతలే ఆయన బయటికి వెళ్లేలా చేశారా? 
బీజేపీ అధిష్టానం రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించడం వెనక బలమైన కారణాలున్నాయా? అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏం చెప్పాలనుకుంది ఢిల్లీ నాయకత్వం?  ఫైర్ బ్రాండ్ లీడర్‌, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి చేసిన రాజీనామాను ఆమోదించింది. రాజీనామా లేఖలో రాజా సింగ్ ప్రస్తావించిన అంశాలను కూడా తప్పు పట్టింది. గతంలో ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఆ తర్వాత కొన్నాళ్ళకు సస్పెన్షన్ ఎత్తేసి… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్‌ ఇచ్చింది కాషాయ పార్టీ. ఈ విడత గెలిచాక… గత కొంత కాలంగా పార్టీ మీద, నేతల మీద గట్టి విమర్శలే చేస్తూ వచ్చారు రాజాసింగ్‌. చివరకు మొన్న జూన్‌ 30న బీజేపీకి రాజీనామా చేశారాయన. ఆ లెటర్‌ రాష్ట్రం నుంచి కేంద్ర పార్టీకి వెళ్ళిన 15 రోజులలోపే ఆమోదించింది… తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించేసింది కేంద్ర నాయకత్వం. గోషామహల్ ఎమ్మెల్యేని పార్టీ పెద్దలు ఎందుకు లైట్‌ తీసుకున్నారంటూ చర్చలు మొదలయ్యాయి. ప్రధాని మోదీ నుంచి మొదలు పెడితే ఢిల్లీలోని పార్టీ ముఖ్య నేతలంతా… రాజాసింగ్‌ని వ్యక్తిగతంగా గుర్తు పడతారు. అయినా సరే రాజీనామా ఆమోదం విషయంలో ఇవేమీ పనికి రాలేదు. దీనిచుట్టూనే ఇప్పుడు సరికొత్త విశ్లేషణలు మొదలయ్యాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదించడం ద్వారా క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పారా? వ్యక్తులకంటే పార్టీనే గొప్పదన్న సందేశం పంపారా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
రాజాసింగ్‌ ఎపిసోడ్‌ ద్వారా అందరికీ సందేశం పంపినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీకి తాత్కాలికంగా నష్టం జరిగినా ఫర్లేదుగానీ ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదని డిసైడైందట కేంద్ర నాయకత్వం. అందుకే ఎమ్మెల్యే అయినాసరే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐతే రాజాసింగ్ తర్వాత అడుగు ఏంటని చర్చ జరుగుతోంది. ఏ పార్టీలో చేరుతారు.? రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగిస్తారని ఆసక్తి నెలకొంది.

Views: 3

About The Author

Tags:

Related Posts

Latest News